ads
తాజా :
Leela Narayana Pest Control
Sree VijayaLakshmi Textiles
For Suggestions

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పుట్టుక‌కు ఘ‌న చ‌రిత్రే ఉంది. ప‌చ్చ‌ని పంట‌పొలాల‌తో సిరులు ఒలికించే ఈ జిల్లా ఈ రాష్ట్రానికే అన్న‌పూర్ణ‌గా భాసిల్లింది. 1859లో ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల‌ను క‌లిపి గోదావరి జిల్లాగా పిలిచేవారు. అప్ప‌టి ప్ర‌ధాన కేంద్రం కాకినాడ‌. ప‌శ్చిమ‌ప్రాంతంగా ఉన్న గోదావ‌రి ప‌డ‌మ‌ర భాగంలో (ప్ర‌స్తుతం ఉన్న జిల్లా) ఐదు తాలూకాలు ఉండేవి. వీటిలో ఏలూరు, య‌ర్న‌గూడెం, న‌ర‌సాపురం, త‌ణుకు, భీమ‌వ‌రం ఉన్నాయి. తూర్పుగోదావ‌రి జిల్లా నుంచి ఐదు తాలూకాలు వేరుచేసి మ‌చిలీప‌ట్నంకేంద్రంగా ప‌శ్చిమ ప్రాంతాన్ని 1904లో కృష్ణా జిల్లాలో క‌లిపారు. చివ‌ర‌కు పోల‌వ‌రం తాలూకాను మిన‌హాయించి కృష్ణా జిల్లా నుంచి వేరుచేసిన ప‌శ్చిమ‌మ‌గోదావ‌రి జిల్లాను 1925 ఏప్రిల్ 15వ తేదీన ఏర్పాటుచేశారు. అప్ప‌టికి మ‌చిలీప‌ట్న‌మే జిల్లా కేంద్రం. 1926 జ‌న‌వ‌రి నాలుగోతేదీన ఏలూరును జిల్లా కేంద్రంగా మార్చారు. 1942లో పోల‌వ‌రం తాలూకాను కూడా ఈ జిల్లాలో క‌ల‌ప‌డం వ‌ల్ల ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాకు స‌మ‌గ్ర స్వ‌రూపం ఏర్ప‌డింది. తాలూకాల‌ను ర‌ద్దు చేసి మండ‌ల వ్య‌వ‌స్థ అమ‌లులోకి వ‌చ్చాక 1986లో జిల్లాను 46 మండ‌లాలుగా విభ‌జించారు. భౌగోళిక విస్తీర్ణం 7742చ‌.కి.మీ. గోదావ‌రికి తూర్పున తూర్పుగోదావ‌రి, ద‌క్షిణ‌, ప‌డ‌మ‌రన కృష్ణా జిల్లా, ఉత్త‌రాన ఖ‌మ్మం జిల్లాలు ఉన్నాయి. ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల‌ను వేరుచేస్తూ ప‌ర‌వళ్లు తొక్కుతున్న గోదావ‌రి విజ్జేశ్వ‌రం నుంచి ప్ర‌వ‌హించి వ‌శిష్ట గోదావ‌రిగా రూపాంతరం చెంది న‌ర‌సాపురం వ‌ర‌కు ప్ర‌వ‌హిస్తోంది. చివ‌ర‌కు బంగాళాఖాతంలో క‌లిసిపోతుంది. పాపికొండ‌లు, బంగాళాఖాతం, కొల్లేరు స‌ర‌స్సు కొంత‌మేర త‌మ్మిలేరు ఈ జిల్లాకు ఎల్ల‌లుగా ఉన్నాయి.

1927లో నిడ‌ద‌వోలు డివిజ‌న్ తాలూకాను కొవ్వూరుగా మార్చారు. 1954లో భీమ‌వ‌రం డివిజ‌న్‌ను ర‌ద్దు చేసి దాని స్థానంలో న‌ర‌సాపురం డివిజ‌న్‌ను కొత్త‌గా ఏర్పాటుచేశారు. దీనిలో భాగంగానే భీమ‌వ‌రం తాలూకాను కూడా ఈ డివిజ‌న్‌లోనే క‌లిపారు. తాడేప‌ల్లిగూడెం తాలూకాను ర‌ద్దుచేసి ఏలూరు డివిజ‌న్‌లో క‌లిపారు. పోల‌వ‌రం, చింత‌ల‌పూడిల‌ను పూర్తిస్థాయి తాలూకాలుగా 1956లో ఏర్పాటు చేశారు. దీంతో ఏలూరు, న‌ర‌సాపురం, కొవ్వూరు డివిజ‌న్లు పూర్తి చేసి పూర్తి స్థాయిలో ఎనిమిది తాలూకాలు ఏర్పాటయ్యాయి. 1979లో భీమ‌వ‌రం, ఏలూరు, య‌ర్న‌గూడెం, న‌ర‌సాపురం, త‌ణుకు, తాడేప‌ల్లిగూడెం తాలూకాల‌ను విబ‌జించి ఆకివీడు, పోడూరు, పెనుమంట్ర‌, గ‌ణ‌ప‌వ‌రం, గోపాల‌పురం, భీమ‌డోలు కేంద్రాలుగా, మ‌రో ఆరు తాలూకాల‌ను ఏర్పాటు చేశారు. వీటిని అమ‌లులోకి తీసుకువ‌చ్చే స‌మ‌యంలో కొత్త‌గా మండ‌ల వ్య‌వ‌స్థ ఆవిర్భ‌వించ‌డంతో ఈ ప్ర‌తిపాద‌న కాస్తా మ‌రుగున‌ప‌డింది. 1986లో మండ‌ల వ్య‌వ‌స్థ రావ‌డంతో తాలూకాల‌కు చ‌ర‌మ‌గీతం పాడారు. విజ్జేశ్వ‌రం వ‌ద్ద చీలిపోయిన గోదావ‌రి జిల్లాలో 64 కి.మీ. పొడ‌వున ప్ర‌వ‌హిస్తోంది. జిల్లాకు ఈశాన్య స‌రిహ‌ద్దులో ఉన్న పోల‌వ‌రంలో గోదావ‌రి అడుగుపెడుతోంది. విజ్జేశ్వ‌రం వ‌ద్ద నిర్మించిన ఆన‌క‌ట్ట‌, బ్యారేజీల వ‌ల్ల ప‌శ్చిమ‌డెల్టాలోని అధికభాగం ప‌చ్చ‌ని పంట పొలాల‌తో స‌స్య‌శ్యామ‌లంగా విరాజిల్లుతోంది. గోదావ‌రితో పాటు ఎర్ర‌కాలువ‌, త‌మ్మిలేరు, కొవ్వాడ‌, గుండేరు, జ‌ల్లేరు, బైనేరు ఇత‌ర ప్ర‌ధాన జ‌ల‌వ‌న‌రులు తాడేప‌ల్లిగూడెం, ఏలూరు, భీమ‌వ‌రం ప్రాంతాల‌కు కృష్ణా జిల్లా స‌రిహ‌ద్దుగా సుమారు 250 కి.మీ విస్తీర్ణంలో విస్త‌రించిన కొల్లేరు ఈ జిల్లా ప్ర‌కృతి సౌంద‌ర్యాన్ని ఎంత‌గానో పెంచుతోంది. మ‌త్స్య సంప‌ద‌తో పాటు ఆయా దేశాల‌కు చెందిన ప‌క్షిజాతులు ఇక్క‌డి సంద‌ర్శ‌కుల‌ను ఎంత‌గానో ఆకర్షిస్తాయి. వీటిలో కొల్లేటి కొంగ‌లు ప్ర‌సిద్ధిగాంచాయి. 1984 ప్రాంతంలో కొల్లేరులో చేపల చెరువులు సాగు చేయ‌డం ద్వారా జిల్లాలో నీలి విప్ల‌వానికి తెర‌తీసింది. ఈ సాగు నేడు ల‌క్ష‌లాది ఎక‌రాల్లో డాల‌ర్ల పంట పండిస్తోంది. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాకు సుమారు 19 కి.మీ పొడ‌వున స‌ముద్ర తీర ప్రాంతం ఉంది. న‌ర‌సాపురం కేంద్రంగా గోదావ‌రి బేసిన్లో అపార స‌హ‌జ‌వాయు నిక్షేపాలు ఉన్న‌ట్టు ప‌రిశీల‌న‌లో బ‌య‌ట‌ప‌డింది. ద్వార‌కాతిరుమ‌ల ప‌రిస‌ర ప్రాంతాల్లో తెల్ల‌సుద్ద గ‌నులు ఎక్కువ‌గా ఉన్నాయి. ఫ‌లితంగా సిరామిక్ ప‌రిశ్ర‌మ‌లు, ఇటుక ప‌రిశ్ర‌మ‌లు అనేకం వెలిశాయి. అంతేకాక జిల్లాలో గ్రానైట్‌, మైకా గ‌నులు కూడా ఉన్నాయి. వ‌రి చెర‌కు, పొగాకు, ప్ర‌ధాన పంట‌లుగా పండిస్తున్నారు. మెట్ట ప్రాంతాల్లో మామిడి, జీడిమామిడి, అర‌టి, కొబ్బ‌రి తోట‌ల సాగు పెరిగింది. వాణిజ్య పంట‌లైన మిర్చి, ప‌సుపు, వేరుశ‌న‌గ‌, కంద‌ల‌కు కూడా ఆద‌ర‌ణ బాగుంది.

భౌగోళిక స్వరూపం

గోదావరి నది డెల్టాలో కొంత భాగం ఈ జిల్లాలో ఉంది. జిల్లా వైశాల్యం 7,780 చ.కి.మీ. (19,26,277 ఎకరాలు). సగటు వర్షపాతం 1076.20 మిల్లీమీటర్లు. నైసర్గికంగా జిల్లాను మూడు సహజ ప్రాంతాలుగా విభజించవచ్చు-

డెల్టా ప్రాంతం : నరసాపురం, తణుకు, కొల్లేరు ప్రాంతాలు

మెరక : పెదవేగి, చింతలపూడి మండ‌లాలు

ఏజన్సీ (అటవీ) ప్రాంతం : పోలవరం, జంగారెడ్డిగూడెం చుట్టుప‌క్క‌ల ప్రాంతాలు

డెల్టా ప్రాంతంలో కృష్ణా, గోదావరి నదుల కాలవలు ప్రధానమైన నీటి వనరులు. పెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు ఈ జిల్లాలోనే ఉంది. జిల్లాలో అటవీ ప్రాంతం 81,200 హెక్టార్లు. మొత్తం వైశాల్యంలో సుమారు 10.5%. సాగు భూమిలో అధిక భాగం వరి పంట (82.8%), తరువాత పొగాకు (4.9%), చెరకు (4.7%), మిర్చి (1.3% సాగు చేస్తున్నారు. జిల్లా ఆర్ధిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం, వ్యవసాయాధారిత సేవలు, పరిశ్రమలపైనా ఆధారపడి ఉంది. పనిచేసే వారిలో దాదాపు 78% జనాభా వ్యవసాయాధారితమైన వృత్తులే నిర్వ‌హిస్తున్నారు. వరి, చెరకు, పొగాకు, కొబ్బరి, మామిడి, మొక్కజొన్న, ఆయిల్ పామ్, వేరుశనగ, అపరాలు, ప్రొద్దు తిరుగుడు జిల్లాలో ప్రధానమైన పంటలుగా సాగు చేస్తున్నారు.

పంటలు

 

పంటవిస్తీర్ణం (వేల హెక్టార్ల‌లో)ఉత్పత్తి (మెట్రిక్ టన్నులు)
వరి 219.6 1,413,108
మొక్కజొన్న 11.5 39,557
కంది 0.28 191
మినుము 9.54 3,885
పెసర 2.79 1,130
వేరుశనగ 3.21 6,476
చెరకు 32.22 2,900,000
పొగాకు 5.76 12,685
మామిడి 20,483 1,22,898
నిమ్మ 1,449 11,592
బత్తాయి 183 1,464
అరటి 5,021 3,26,365
జామ 657 13,140
సపోటా 568 4,544
జీడిమామిడి 44,744 22,372
పసుపు 530 1,855
మిరప 2,703 5,406
తమలపాకు 175 700
కొబ్బరి 22,183 3,327లక్షలు
పామాయిల్ 10,250 61,500
కోకో 2,800 1,400
పోక చెక్క 125 125
కాఫీ 50 25
మిరియం 150 45

 

ఈ పంటలలో వరి, చెరకు డెల్టాలో సాగుతుండ‌గా, అపరాలు ఎక్కువగా డెల్టా ప్రాంతంలో అంతర పంటగా పండిస్తున్నారు. మొక్కజొన్న, పొగాకు, కొబ్బరి మెరక, పల్లపు ప్రాంతంలో కూడా పండుతాయి. జీడిమామిడి, మామిడి, నిమ్మ, ఆయిల్ పామ్ వంటి తోటల పెంప‌కం అధికంగా మెరకలో జరుగుతోంది.

డెల్టాలో సారవంతమైన నల్లరేగడి నేల ఉన్నది. కొద్దిభాగం పాటి నేల. ఎక్కువ భాగం ఎర్ర చెక్కు నేల, ఇసుక నేల కలిసి ఉన్నది. మొత్తం జిల్లాలోని 7.7 లక్షల హెక్టార్ల‌వైశాల్యంలో సుమారు 5.5 లక్షల హెక్టార్లు అనుకూలమైన భూమి. 0.8 లక్షల హెక్టేరులు అడవి ప్రాంతం. 0.45 లక్షల హెక్టార్లు బీడు భూములు. 0.94 హెక్టార్లు ఇతర ఉపయోగాలకు వాడుతున్నారు. 1996-97లో మొత్తం 6 లక్షల హెక్టారులలో వ్యవసాయం జరిగింది.

వ్యవసాయానికి అనుబంధంగా సాగే పశువుల పెంప‌కం కూడా జిల్లా ఆర్ధిక వ్యవస్థలో ముఖ్యభూమిక పోషిస్తోంది. జిల్లాలో 2.5 లక్షల ఆవులు, 4.2 లక్షల గేదెలు, 75వేల గొర్రలు, లక్ష మేకలు, 30 వేల పందులు, 84 లక్షల కోళ్ళు పెంచబడుతున్నాయని అంచనా.

నీటి వనరులు

నిడదవోలు-నరసాపురం కాలువ.

జిల్లాలో సరాసరి సంవత్సర వర్షపాతం 1076.2 మి.మీ. ఇందులో సుమారు 64% వర్షపాతం నైరుతి ఋతుపవనాల సమయంలో (జూన్-సెప్టెంబర్‌కాలం) ఉంటుంది.

జిల్లాలో వ్యవసాయానికి నీరందించేవాటిలో మూడు వ్యవస్థలు ఉన్నాయి.

 

గోదావరి డెల్టా నీటిపారుదల వ్యవస్థ. (సర్ అర్ధర్ కాటన్ బారేజి ద్వారా - 2,10,000 హెక్టార్ల‌వరకు అవకాశం ఉంది.)

కృష్ణా డెల్టా నీటిపారుదల వ్యవస్థ. (ప్రకాశం బారేజి ద్వారా - 23,000 హెక్టార్ల‌కు సాగునీరు అందించేఅవ‌కాశం ఉంది.)

ఇవి కాక తమ్మిలేరు రిజర్వాయరు ద్వారా 3,700 హెక్టార్ల‌కు, జల్లేరు రిజర్వాయరు ద్వారా 1,700హెక్టార్ల‌కు సాగుకు అవకాశం ఉంది. మెరక ప్రాంతంలో భారీగా గొట్టపు బావులద్వారా సాగునీరు వినియోగం జరుగుతోంది.

జిల్లాకు తూర్పు హద్దుగా ఉన్న గోదావరి నది విజ్జేశ్వరం వద్ద గౌతమి గోదావరి, వశిష్ట గోదావరి అనే రెండు పాయలుగా చీలుతుంది. ఇది అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తుంది. ఎర్రకాలువ, తమ్మిలేరు, బైనేరు, కొవ్వాడ కాలువ, జల్లేరు, గుండేరు ఇతర ప్రవాహ నీటి వనరులు. జిల్లాలో దాదాపు 20.2% నేల గోదావరి నది పరీవాహక ప్రాంతంలో, 48.1 % ఎర్రకాలువ పరీవాహక ప్రాంతంలో, 26.8% తమ్మిలేరు ప్రాంతంలో, 1.4% రామిలేరు ప్రాంతంలో, 3.5% లోయేరు ప్రాంతంలోను ఉంది.

కొల్లేరు

245 చ.కి.మీ. వైశాల్యంలో విస్తరించి, దేశంలో అతి పెద్ద మంచినీటి సరస్సు అయిన కొల్లేరు కృష్ణా, గోదావరి నదుల మధ్యప్రాంతలో ఏర్పడిన పల్లపు జలాశయం. ఈ రెండు నదుల మధ్యలో సహజంగా వరద నీటిని బాలెన్స్ చేసే సరస్సుగా ఉపయోగ పడుతోంది. బుడమేరు, తమ్మిలేరు అనే రెండు పెద్ద ఏరులతోబాటు సుమారు 30 చిన్న, పెద్ద కాలువలు కొల్లేరులో కలుస్తాయి. ఉప్పుటేరు ద్వారా కొల్లేరు నీరు సముద్రంలోకి ప్రవహిస్తుంది. ఎన్నో ప్రత్యేకమైన వృక్ష, పక్షిజాతులకు ఇది ఆలవాలమైంది. ఈ ప్రాంతంలో చేపల పెంపకం పెద్ద ఎత్తున ఆర్ధిక, సామాజిక మార్పులను తెచ్చింది. అక్రమంగా కొల్లేరు భాగాలను వ్యవసాయానికి, ఆక్వా కల్చర్‌కు ఆక్రమించుకోవడం వలన కొల్లేరు మనుగడకే ప్రమాదం ఏర్పడింది.

పరిశ్రమలు

జిల్లా పారిశ్రామికంగా పెద్దగా అభివృద్ధి చెంద‌లేద‌నే చెప్ప‌వ‌చ్చు. దీంతో ఇక్క‌డ‌ఉద్యోగావకాశాలు కూడా చాలా తక్కువ. ప్రధానంగా వ్యవసాయాధారితమైన ఉన్న ఈ జిల్లాలో ఉన్న కొద్దిపాటి పరిశ్రమలు కూడా వ్యవసాయాధారితమైనవే.

జిల్లాలో ఏలూరు, భీమవరం, తణుకు, పాలకొల్లులలో పారిశ్రామిక వాడ‌లు ఉన్నాయి. జిల్లాలో పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్ల సంఖ్య ఇలా ఉన్నాయి.

లో టెన్ష‌న్ (ఎల్‌టీ) పారిశ్రామిక కనెక్షన్లు: 7125

హై టెన్షన్ (హెచ్‌టీ) పారిశ్రామిక కనెక్షన్లు: 118

కుటీర పరిశ్రమ పారిశ్రామిక కనెక్షన్లు: 251

జిల్లాలో మొత్తం ట్రాన్స్‌ఫార్మర్లు: 13,541

పరిశ్రమలకు విద్యుత్తునిచ్చే ప్రధాన విద్యుత్ సరఫరా లైనులు, హై వోల్టేజీ సబ్‌స్టేషన్లు ఉన్న స్థలాలు: నిడదవోలు, కొవ్వూరు, తణుకు, భీమవరం, దూబచర్ల, తాడిమళ్ళ, చాగల్లు, తాడేపల్లి గూడెం, పాలకొల్లు, ఏలూరు.

మొత్తం జిల్లాలో 52 పెద్ద, మధ్య తరగతి పరిశ్రమలున్నాయి. వీటిలో సుమారు 17వేల మందికి ఉపాధి లభిస్తోంది.

జిల్లాలోని ముఖ్య పరిశ్రమలు:

పూర్ణిమ కెమికల్ ఇండస్ట్రీస్ -ఏలూరు అంబికా దర్బార్ బత్తి - ఏలూరు ఆంధ్రా షుగర్స్ - తణుకు
గౌతమి సాల్వెంట్స్ - తణుకు ఫుడ్స్, ఫాట్స్ & ఫెర్టిలైజర్స్ - తాడేపల్లిగూడెం శ్రీ గురువాయురప్పన్ రైస్ బ్రాన్ ఆయిల్, గణపవరం
పశ్చిమ గోదావరి సహకార చక్కెర ఫాక్టరీ - సూరప్పగూడెం ఆంధ్రా షుగర్స్ (ఆల్కహాలు విభాగం) - కొవ్వూరు సహకార చక్కెర ఫాక్టరీ, పాలకొల్లు
విజయదుర్గా ఆగ్రో ఆయిల్స్ & స్ట్రా బోర్డు - తణుకు వి.వి.ఎస్.షుగర్స్, చాగల్లు పద్మజా ఎడిబుల్ రైస్ సాల్వెంట్ ఆయిలగ, ఉండి
రీజెంట్ ఆగ్రో ప్రొడక్ట్స్ - దేవరపల్లి ఆంధ్రా షుగర్స్ - తాడ్వాయి గోద్రెజ్ ఆగ్రోవెట్ - ద్వారకా తిరుమల
సహకార పామ్ ఆయిల్ - పెదవేగి గవర్నమెంట్ డిస్టిలరీ - చాగల్లు శ్రీ ఇంద్ర డిస్టిలరీ - తణుకు
సదర్న్ పెస్టిసైడ్స్ - కొవ్వూరు శ్రీ రామా డిస్టిలర్స్ - జంగారెడ్డి గూడెం కృష్ణా ఇండస్ట్రియల్ కార్బన్ - జంగారెడ్డిగూడెం
కృష్ణా ఇండస్ట్రియల్ సల్ఫ్యూరిక్ ఆసిడ్ - నిడదవోలు డాక్టర్స్ ఆర్గానిక్ - తణుకు శుభోదయ కెమికల్స్ - గౌరీ పట్నం (దేవరపల్లి)
ఆంధ్రా షుగర్స్ (కాస్టిక్ సోడా) - గోపాలపురం డెల్టా పేపర్ మిల్స్ - వెండ్ర కోస్టల్ కెమికల్స్ - నిడదవోలు
రోలెక్స్ పేపర్స్ - పాలకొల్లు కోస్టల్ ఆగ్రో ఇండస్ట్రీస్ - ఉండ్రాజవరం శ్రీ సత్యనారాయణ కాటన్ యార్న్ - తణుకు
శ్రీ అనంతలక్ష్మీ కాటన్ యార్న్ - ఉండ్రాజవరం శ్రీ అక్కమాంబా టెక్స్టైల్స్ - తణుకు శ్రీ రామభద్ర స్పిన్నర్స్ - తణుకు
శ్రీ వెంకటరాయ కాటన్ యార్న్ - తణుకు ఈస్ట్ ఇండియా కమర్షియల్ (జూట్ మిల్లు) - ఏలూరు కృష్ణా హెస్సియన్ - ఏలూరు
సదరన్ మెగ్నీషియం మెటల్ - దేవరపల్లి కళ్యాణి ఫ్లోరైడ్ - నిడదవోలు ఎన్.సి.ఎల్. ఇండస్ట్రీస్ - దొమ్మేరు (నిడదవోలు)
త్రివేణి గ్లాస్ వర్క్స్ - కొవ్వూరు దేవి సీ ఫుడ్స్ - పెరవలి అవంతి ఫీడ్స్ - కొవ్వూరు
శ్రీ వీరభద్రా మెటల్ ఇండస్ట్రీస్ - అజ్జరం రీఫ్రెష్ వాటర్ ప్లాంట్ - జంగారెడ్డిగూడెం  

ఇవి కాక జిల్లాలో ఈ క్రింది కుటీర పరిశ్రమలు చిన్నపరిశ్రమలు కొన్ని పట్టణాలలో కేంద్రీకృతమై ఉన్నాయి.

తివాచీ పరిశ్రమలు - ఏలూరు ఇత్తడి పనిముట్లు - అజ్జరం, పెరవలి లేసులు - నరసాపురం స్టోన్ క్రషింగ్ యూనిట్లు - దేవరపల్లి పీచు పరిశ్రమలు - నిడదవోలు

నీలి విప్లవం

ఆంధ్ర ప్రదేశ్ ఆవిర్భావం నాటికి పశ్చిమగోదావరి జిల్లాలో చేపల సాగుకు ప్రత్యేకమైన పద్ధతులంటూ ఏమీ లేవు. ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో విస్తరించిన గోదావరి, దక్షిణం వైపున 19.5 కిలోమీటర్ల మేర సముద్రం కొల్లేరు, ఉప్పుటేరు ప్రాంతాల్లో లభించే చేపలతోనే మత్స్యకారులు వ్యాపారం జరిపేవారు. చేపల అధికోత్పత్తి, వాణిజ్య రంగ విస్తరణకు ఎటువంటి పద్ధతులు అప్పట్లో లేవు. 1961 నాటికి జిల్లాలో తొమ్మిది మార్కెట్లే ఉండేవి. అప్ప‌ట్లో 460 టన్నుల చేపల విక్రయాలు జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 1969-70 మధ్య రూ. 10.25 లక్షల విలువైన 471 టన్నుల చేపలు, రూ. 1.61 లక్షల విలువ చేసే 73 టన్నుల రొయ్య అమ్మకాలు జరిగాయి. ఈ క్రమంలోనే మత్స్యపరిశ్రమపై ఆధారపడిన మత్స్యకారుల కోసం 42 ఫిషర్‌మేన్ కోఆపరేటివ్ సొసైటీలు 5805 మంది సభ్యులతో ఏర్పడ్డాయి. 1981 నాటికి ఆ సంఖ్య 61 సొసైటీలకు పెరిగింది. 1960లో బాదంపూడిలో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించడంతో జిల్లాలో చేపల పెంపకం చెరువుల్లో మొదలైంది. ఇందుకోసం ప్రభుత్వం ఆధ్వర్యంలో భీమవరం సమీపంలోని పెదఅమిరం, నరసాపురం, కొవ్వలి, తణుకు, ఏలూరు, కొవ్వూరు తదితర చోట్ల చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు వెలిశాయి.

80వ దశకం నుంచి విప్లవాత్మక మార్పులు

శాస్త్రీయ పద్ధతుల్లో వాణిజ్య వ్యాపారంగా చేపల పెంపకం 1980 నుంచి ప్రారంభమైంది. తొలుత జిల్లాలో ఆకివీడు, కృష్ణా జిల్లా కైకలూరు కేంద్రాలుగా చేపల పెంపకం విస్తరించింది. ప్రారంభంలో 20 వేల ఎకరాల్లో మొదలైన ఈ సాగు 1985-86 ప్రాంతంలో వరి పంట నష్టాలకు గురవుతుండటంతో ఒకేసారి మరో 10 వేల ఎకరాలకు విస్తరించింది. భీమవరం, నిడమర్రు, గణపవరం, కాళ్ళ, ఉండి, వీరవాసరం, మొగల్తూరు, నరసాపురంలలో చేపల చెరువులు బాగా విస్తరించాయి. ప్రధానంగా భీమవరం ప్రాంతంలో చేపల పరిశ్రమ అభివృద్ధి కోసం ఆనంద గ్రూపు-అమాల్‌గమ్ ఫిషరీస్ సంయుక్తంగా 1988లో కొత్త పద్ధతులను, ఫిష్ ప్యాకింగ్ గ్రేడింగ్ విధానాలను ప్రారంభించాయి. అప్పటి వరకు ఒక మోస్తరుగా రైళ్ళ ద్వారా చేపల ఎగుమతులు జరిగేవి. త‌రువాత‌ప్యాకింగ్‌తో ట్రేడింగ్ విధానం ప్రారంభం కావడంతో భీమవరం చేపల ఉత్పత్తుల పెంపకానికి ప్రధాన కేంద్రంగా మారింది. అస్సాం, ఢిల్లీ, కలకత్తా తదితర ప్రాంతాలకు చేపల ఎగుమతులు ప్రారంభమయ్యాయి. తొలి రోజుల్లో 500 టన్నుల ఉత్పత్తులు ఎగుమతి అయ్యేవి. 1985 నాటికి ఉప్పునీటి చేపల ఉత్పత్తి 4 వేల టన్నులు, మంచినీటి చేపల ఉత్పత్తి 10546 టన్నులకు పెరిగింది.1990 నాటికి జిల్లాలో ఏలూరు, ఆకివీడు, భీమవరం, పాలకొల్లు, పెనుగొండ, తణుకు, పడాల, కొవ్వలి ప్రాంతాలలో 200 టన్నుల ఐస్‌ను ఉత్పత్తి చేసే 24 ఫ్యాక్టరీలను నెలకొల్పారు. 1990 ప్రాంతంలో మరో 50వేల ఎకరాలు చేపల చెరువులుగా మారిపోయాయి. దీంతో గ్రామాలకు గ్రామాలు హరిత విప్లవం నుంచి నీలి విప్లవం వైపు మరలాయి.

తాజా పరిణామాలు

రెండున్నర దశాబ్దాలలో 20 వేల ఎకరాల నుంచి జిల్లాలో 1.50 లక్షల ఎకరాల విస్తీర్ణానికి పెరిగాయి. 1990 నాటికి ప్రభుత్వం ప్రైవేటు రంగాలలో 7054 చెరువులు ఉండగా 20 వేలకు పెరిగినట్లు అంచనా. ఒక్క గణపవరం, నిడమర్రు, ఆకివీడు మండలాలలో గతంలో 35 లారీల చేపలు కలకత్తా మార్కెట్‌కు రోజూ వెళ్ళేవి. ప్రస్తుతం రోజుకి 1250 లారీల్లో చేపలు ఎగుమతి అవుతున్నాయి.

జిల్లాలోని మండలాలు

1.జీలుగుమిల్లి 2.బుట్టాయగూడెం 3.పోలవరం 4. తాళ్ళపూడి
5. గోపాలపురం 6. కొయ్యలగూడెం 7. జంగారెడ్డిగూడెం 8. టి.నరసాపురం
9. చింతలపూడి 1.0 లింగపాలెం 11. కామవరపుకోట 12. ద్వారకా తిరుమల
13. నల్లజర్ల 14. దేవరపల్లి 15. చాగల్లు 16. కొవ్వూరు
17. నిడదవోలు 18. తాడేపల్లిగూడెం 19. ఉంగుటూరు 20. భీమడోలు
21. పెదవేగి 22. పెదపాడు 23. ఏలూరు 24. దెందులూరు
25. నిడమర్రు 26. గణపవరం 27. పెంటపాడు 28. తణుకు
29. ఉండ్రాజవరం 30. పెరవలి 31. ఇరగవరం 32. అత్తిలి
33. ఉండి 34. ఆకివీడు 35. కాళ్ళ 36. భీమవరం
37. పాలకోడేరు 38. వీరవాసరము 39. పెనుమంట్ర 40. పెనుగొండ
41. ఆచంట 42. పోడూరు 43. పాలకొల్లు 44. యలమంచిలి
45. నరసాపురం 46. మొగల్తూరు 47. కుక్కునూరు 48. వేలేరుపాడు

తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిమిత్తం ఖమ్మం జిల్లాకు చెందిన బూర్గంపాడు, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు ఈ జిల్లాలో కలిపారు.

రవాణా వ్వవస్థ

నర్సాపురం-నిడదవోలు ప్రధాన రహదారి, కాలువ.

5వ నెంబరు జాతీయ రహదారి పశ్చిమ గోదావరి జిల్లా గుండా వెళుతుంది.

జిల్లాలో రోడ్ల వివ‌రాలు

మొత్తం రోడ్ల పొడవు: 5,194 కి.మీ.

 దీనిలో జాతీయ రహదారి: 108 కి.మీ.

రాష్ట్ర రహదారులు: 281 కి.మీ.

జిల్లా స్థాయి రోడ్లు: 1308 కి.మీ.

రైలు మార్గం

మద్రాసు-కొలకత్తా రైలు మార్గం ఈ జిల్లా మీదుగా ఉంది. ట్రంకు రైలు మార్గం పొడవు 90 కి.మీ. బ్రాంచి లైను పొడవు 75 కి.మీ. (గుడివాడ-భీమవరం-నిడదవోలు/నరసాపురం) జిల్లాలో ముఖ్యమైన రైల్వే స్టేషన్లు: ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు (జంక్షన్), భీమవరం టౌన్, భీమవరం జంక్షన్, కొవ్వూరు, తణుకు, పాలకొల్లు, నరసాపురం, ఆకివీడు, భీమడోలు.

జ‌ల ర‌వాణా

జిల్లాలో కాలువల ద్వారా ప్రయాణం, సరకుల రవాణా పెద్దగా జరగడం లేదు. గోదావరి డెల్టాలో కొంత వినియోగం జరుగుతున్నది.

విమాన‌యానం

జిల్లాలో తాడేపల్లిగూడెంలో విమనాశ్రయం ఉన్నప్పటికీ ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది. ఇటీవల కాలంలో ఈ విమానాశ్రయం వినియోగంలోకి తీసుకురావాలనే ప్రయత్నాలు జరిగాయి. గన్నవరం (విజయవాడ), మధురపూడి (రాజమండ్రి) విమానాశ్రయాలు ప్రస్తుతం జిల్లావాసులకు అందుబాటులో ఉన్నాయి.

రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలాగానే ప్రయాణికుల నిత్యావసరాలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ వారి బస్సు సర్వీసులే ప్రధాన ప్రయాణ సాధనాలు. కొంత వరకు హైదరాబాదు మరియు విశాఖపట్నం నగరాలకు ప్రైవేటు బస్సులు నడుస్తున్నాయి. పట్టణ పరిసర గ్రామాలలో ఆటోల వినియోగం ఇటీవల బాగా పెరిగింది.

జనాభా

పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం జనాభా 37.96 లక్షలు. ఇందులో 30.48 లక్షలు గ్రామీణ ప్రాంతాలలో, 7.45 లక్షలు పట్టణ ప్రాంతాలలోను నివసిస్తున్నారు. జిల్లా వైశాల్యం 7742 చ.కి.మీ. కనుక జనసాంద్రత చ.కి.మీ.కు 490. జనాభాలో 70% పైగా ప్ర‌జ‌లు వ్యవసాయాధారిత‌ఉపాధిపై జీవిస్తున్నారు.

2001 జనాభా లెక్కల ప్ర‌కారం

జనాభా: 37.96 లక్షలు (పురుషులు 19.06 లక్షలు, స్త్రీలు 18.9 లక్షలు)

దశాబ్దంలో జనాభా పెరుగుదల:  7.92%

జన సాంద్రత: చ.కి.మీ.కు 490 మంది

అక్షరాస్యత: 73.95% (పురుషులలో 78.4%, స్త్రీలలో 69.4 %)

మొత్తం జనాభాలో పని చేసేవారు: 43.4%

వ్యవసాయ సంబంధిత ఉపాధిలో : 71.2%

గనుల పనులలో : 0.2%

పరిశ్రమలలో: 5.1% (కుటీర పరిశ్రమలు మినహాయించి)

కుటీర పరిశ్రమలలో: 2.21%

నిర్మాణం పనులు: 1.01%

సేవా రంగంలో: 19.5%

మొత్తం వైశాల్యంలో అడవులు 10.38%

వ్యవసాయం జరిగే భూమిలో నీటి వసతి ఉన్నది: 86.5%

తలసరి ఆహార ధాన్యాల ఉత్పత్తి: 383 కి.గ్రా.

ప్రతి 100 చ.కి.మీ.కు రోడ్ల పొడవు: 77.42 కి.మీ.

పర్యాటకం

కొల్లేరు సరస్సు

జిల్లాలో 700 కి.మీ. వైశాల్యంగల కొల్లేరు సరస్సు ఉంది. అనేకరకాల విదేశీ  పక్షులు అక్టోబరు - మే మాసాలలో ఇక్కడకు వ‌ల‌స వ‌స్తాయి.

ఏలూరు సమీపాన "చిన్న తిరుపతి"గా ప్రసిద్ధిగాంచిన ద్వారకా తిరుమల ఉంది. యాత్రికులకు సమస్త సౌకర్యాలున్న ఈ ఆలయంలో పెళ్ళిళ్ళు ఎక్కువ‌గా జరుగుతాయి.

పోలవరం సమీపంలో ఉన్న పాపి కొండలు ముఖ్యమైన పర్యాటక ప్రాంత్రం. ప్రతి రోజు పట్టిసం నుంచి రాజమండ్రి గుండా పేరంటాలపల్లి వరకూ గోదావరిలో లాంచి ప్రయాణం ఉంటుంది.

కామవరపుకోట మండలంలో బౌద్ధారామాలు ఉన్నాయి.

మొగ‌ల్తూరు మండ‌లంలోని పేరుపాలెం బీచ్ ప‌ర్యాట‌కంగా అభివృద్ధి చెందుతోంది.

విద్యాసంస్థలు

ప్రధానంగా వ్యవసాయంపై ఆధార పడిన ప్రాంతము, అటవీ ప్రాంతము ఉన్న ఈ జిల్లా 73.95% (పురుషులు 78.43%, స్త్రీలు 69.45%) అక్షరాస్యతలో ఆంధ్ర ప్రదేశ్‌లో హైదరాబాదు తరువాత రెండవ స్థానంలో ఉన్నది. మొత్తం దేశంలో ఈ జిల్లా చదువుకొన్న వారి సంఖ్య ప్రకారం 31వ స్థానంలోను, అక్షరాస్యత శాతం ప్రకారం 149వ స్థానంలోను ఉన్నది. జిల్లాలో మహానగరాలు ఏవీ లేకపోవడం వలనా, విశ్వవిద్యాలయం లేకపోవడం వలనా ఉన్నత విద్యకు అవకాశాలు దాదాపు శూన్యం. పై చదువులకు విద్యార్ధులు ఎక్కువగా ఇతర జిల్లాలకు, లేదా ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు కూడా వెళుతున్నారు. ఇటీవల ప్రైవేటు రంగంలో విద్యావకాశాలు పెరగడం వలన ఇంజినీరింగ్, మెడికల్ విద్యాలయాలు జిల్లాలో స్థాపించబడ్డాయి.

జిల్లాలో విద్యాల‌యాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

ప్రాథమిక పాఠశాలలు - 2555

మాధ్యమిక పాఠశాలలు - 349

ఉన్నత పాఠశాలలు - 385

ప్రభుత్వ గురుకుల పాఠశాలలు - 2

నవోదయ పాఠశాలలు - 2

జూనియర్ కళాశాలలు - 51

డిగ్రీ కళాశాలలు - 37

ఐ.టి.ఐ.లు - 23

పాలిటెక్నిక్ కళాశాలలు - 6

ఇంజినీరింగ్ కళాశాలలు -25 (ఏలూరు-6, తాడేపల్లిగూడెం-3, తణుకు-1, జంగారెడ్డిగూడెం-3, భీమవరం-8 నరసాపురం-1)

మెడికల్ కళాశాలలు - 2 (ఏలూరు), (భీమవరం)

బి.ఎడ్.కళాశాలలు - 4

ప్రముఖ విద్యా సంస్థలు

ఆంధ్ర విశ్వవిద్యాలయం పి.జి కళాశాల , తాడేపల్లిగూడెం

జిల్లాలో ఎక్కువ కళాశాలలు ఆంధ్ర విశ్వ విద్యాలయానికి అనుబంధంగా ఉన్నాయి. అనేక విద్యాలయాలు నిర్వహించే సంస్థలలో ఏలూరుకు చెందిన సర్.సి.ఆర్.రెడ్డి విద్యా సంస్థల సముదాయము, సెయింట్ థెరిసా విద్యాలయాలు, భీమవరానికి చెందిన డి.ఎన్.ఆర్. విద్యా సంస్థల సముదాయము ముఖ్యమైనవి. ఇటీవల కార్పొరేట్ విద్యారంగం పెరిగిన కారణంగా ప్రైవేటు రంగంలో అనేక విద్యా సంస్థలు స్థాపించబడినాయి.

ముఖ్య పుణ్యక్షేత్రాలు

ద్వారకా తిరుమల

పట్టిసీమ

మద్ది

గౌరీపట్నం

నిడదవోలు

వీరంపాలెం

పెనుగొండ

పాలకొల్లు

భీమవరం

నత్తా రామేశ్వరం

క్రీడలు

భీమవరం వాసి అయిన వెంకటపతి రాజు ఇండియన్ నేషనల్ క్రికెట్ టీం తరపున 28 టెస్ట్ మ్యాచ్ లు మరియు 53 వన్ డే మ్యాచ్ లు ఆడాడు. అతని పూర్తి పేరు సాగి లక్ష్మి వెంకటపతి రాజు.

రాజకీయాలు

పశ్చిమ గోదావరి జిల్లాలో 16 శాసనసభ నియోజకవర్గాలతో పాటూ రెండు లోక్ సభ (ఏలూరు, నర్సాపురం) నియోజకవర్గాలు ఉన్నాయి. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాలు పెనుమార్పులకు పెట్టిందిపేరు. రాజకీయంగా సున్నితమైన ఈ జిల్లా రాజకీయ వాతావరణంలో తీవ్రమైన మార్పులు ఎక్కువ. ఏలూరులో కాంగ్రెసు పార్టీకి కూడా తిరుగులేని ప్రస్థానం ఉన్నది. మాగంటి రవీంద్రనాథ్ చౌదరి ఏలూరులో తిరుగులేని ప్రజానాయకుడు, ఏకఛత్రాధిపత్యంగా పరిపాలనను సాగించిన ప్రజావాది. 1989 ఎన్నికలలో తప్ప రాష్ట్రంలో అధికారములోకి వచ్చిన పార్టీ పశ్చిమగోదావరి జిల్లాలో అధిక సంఖ్యలో శాసనసభా స్థానాలను గెలుచుకోవటం పరిపాటే. 1983లో తెలుగుదేశం ప్రభంజనంలో కోటగిరి విద్యాధరరావు చింతలపూడి నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా గెలుపొందిన ఒక్క స్థానము తప్ప మిగిలిన 16 స్థానాలూ తెలుగుదేశం పార్టీ గెలుచుకున్నది. 1985 ఎన్నికలలో 15 స్థానాలు టీడీపీకి, అచంట నియోజక వర్గం మాత్రం దాని మిత్రపక్షమైన సిపిఐ(ఎం)కు దక్కాయి. 1989లో ఏర్పడిన పాలకవర్గ వ్యతిరేక వైఖరివల్ల జిల్లాలో కాంగ్రెసు 7 స్థానాలు గెలుచుకున్నది. 1999 ఎన్నిక‌ల‌లో తెలుగుదేశం తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు ఒక్క కొవ్వూరు స్థానం తప్ప మిగిలిన నియోజకవర్గాలన్నింటిలో తెలుగుదేశం అభ్య‌ర్థులే గెలిచారు.

2014  ఎన్నిక‌ల్లో గెలిచిన ప్రస్తుత శాసనసభ్యుల జాబితా

క్ర.సంఖ్యఅసెంబ్లీ నియోజకవర్గంవిజేతపార్టీ
173 కొవ్వూరు కె.యస్. జవహర్ టీడీపీ
174 నిడదవోలు బూరుగుపల్లి శేషారావు టీడీపీ
175 ఆచంట పితాని సత్యనారాయణ టీడీపీ
176 పాలకొల్లు నిమ్మల రామానాయుడు టీడీపీ
177 నర్సాపురం బండారు మాధవనాయుడు టీడీపీ
178 భీమవరం పులపర్తి రామాంజనేయులు టీడీపీ
179 ఉండి క‌ల‌వ‌పూడి వెంక‌ట‌శివరామరాజు టీడీపీ
180 తణుకు ఆరిమిల్లి రాధాకృష్ణ టీడీపీ
181 తాడేపల్లిగూడెం పైడికొండల మాణిక్యాలరావు టీడీపీ
182 ఉంగుటూరు వీరాంజనేయులు టీడీపీ
183 దెందులూరు చింతమనేని ప్రభాకర్ టీడీపీ
184 ఏలూరు బ‌డేటి కోట‌రామారావు (బుజ్జి) టీడీపీ
185 గోపాలపురం ముప్పిడి వేంకటేశ్వరరావు టీడీపీ
186 పోలవరం మొడియం శ్రీనివాసరావు టీడీపీ
187 చింతలపూడి పీతల సుజాత టీడీపీ

కార్పొరేష‌న్‌, మునిసిపాలిటీలు          

జిల్లాలో ఏకైక కార్పొరేష‌న్‌గా ఏలూరు ఉండ‌గా, త‌ణుకు, తాడేప‌ల్లిగూడెం, కొవ్వూరు, నిడ‌ద‌వోలు, న‌ర‌సాపురం, పాల‌కొల్లు, భీమ‌వ‌రం మునిసిపాలిటీలుగా, జంగారెడ్డిగూడెం న‌గ‌ర పంచాయ‌తీలుగా ఉన్నాయి.