ads
Sree VijayaLakshmi Textiles
Leela Narayana Pest Control
For Suggestions
1

ఒకప్పుడు హేలాపురిగా వ్యవహరించబడిన ఏలూరు 1866 లోనే దేశంలోని రెండో మునిసిపాలిటీగా ఆవిర్భ‌వించింది. 2005 లో మునిసిపల్ కార్పొరేషన్ స్థాయికి ఎదిగింది. చెన్నై - కొల్‌క‌త జాతీయ రహదారి (NH5)లో విజయవాడ నుంచి 63 కి.మీ, రాజమండ్రి నుంచి 98 కి.మీ. దూరంలో ఉంది. జిల్లా కేంద్రం కావడంతో ప్రభుత్వ కార్యాలయాల కేంద్రంగా, చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజల వ్యాపార, వైద్య, విద్య, రవాణా కేంద్రంగా ఉంది. వరి, కూరగాయల సాగు, పొగాకు వర్తకం, చేపల ఎగుమతి, మార్కెట్ యార్డు, సీఆర్ ఆర్ క‌ళాశాల‌, అంబికా దర్బార్ బత్తి, జూట్‌మిల్లు, తివాచీలు, తమ్మిలేరు, కృష్ణ కాలువ, సమీపంలో కొల్లేరు సరస్సు - ఇవి ఏలూరు గురించి చెప్పేట‌పుడు ప్ర‌స్తావించే ప్ర‌ధాన అంశాలు. ఏలూరు నగరానికి ఒక ప‌క్క పల్లపు ప్రాంతాలైన కొల్లేరు, కైకలూరు, మరొకవైపు మెర‌క ప్రాంతాలైన చింతలపూడి, జంగారెడ్డిగూడెం ఉన్నాయి. చింతలపూడి వైపు నుంచి వచ్చే తమ్మిలేరు వాగు ఏలూరు ప్రారంభంలో అశోక్‌న‌గ‌ర్ వ‌ద్ద‌రెండు పాయ‌లుగా చీలిపోయింది. ఎడమవైపు వాగు తంగెళ్లమూడి మీదుగా ప్రవహిస్తూ నగరానికి ఒక వైపు సరిహద్దుగా ఉండ‌గా, రెండవ చీలిక ఆశోక్ నగర్, అమీనా పేట మీదుగా ప్రవహిస్తూ బస్‌స్టాండు, సి.ఆర్.రెడ్డి క‌ళాశాల పక్కగా ప్రవహిస్తూ, నగరానికి మ‌రో సరిహద్దుగా ఉంది. ఈ రెండింటి మ‌ధ్య డెల్టాలా ఏలూరు న‌గ‌రం విస్త‌రించి ఉంది. ఎగువ ప్రాంతాల్లో వ‌ర్షాలు ఎక్కువ‌గా కురిస్తే ఆ నీరు త‌మ్మిలేరు ద్వారా ఏలూరును చుట్టుముట్టేది. చింత‌ల‌పూడి మండ‌లంలోని నాగిరెడ్డిగూడెం ప్రాజెక్ట్ నిర్మించే వ‌ర‌కు ఏలూరుకు ఇదే ముప్పు పొంచి ఉండేది. అలాగే కృష్ణానది నుంచి వచ్చే ఏలూరు కాలువ పట్టణం మధ్యలో నైఋతి నుంచి ఈశాన్యం దిశగా ప్రవహిస్తుంది. అదేవిధంగా రాజ‌మండ్రి గోదావరి నుంచి వచ్చే ఏలూరు కాలువ, కృష్ణ కాలువ, తమ్మిలేరు - ఇవి మూడూ పాలగూడెం (మల్కాపురం) వైపు దారిలోని తూర్పులాకుల వ‌ద్ద క‌లిసి కొల్లేరులో క‌లుస్తాయి. ఏరులు ముంచెత్తుండ‌టంతో ఈ ఊరికి ఏరులూరు పేరు ఏర్ప‌డి క్ర‌మంగా అది ఏలూరుగా మారింద‌ని ఒక క‌థ ప్ర‌చారంలో ఉంది.


1901లో పట్ణణ‌జనాభా 33,521 కాగా, 1991 నాటికి 2,12,866 కు చేరుకుంది. 1991 లెక్కల ప్రకారం అక్షరాస్యత 72%. 2001లో జనాభా 2,15,642.

భౌగోళికంగా ఏలూరు సముద్ర తలం నుంచి 22 మీటర్లు (72 అడుగులు) ఎత్తులో ఉంది. బంగాళాఖాతం తీరం నుంచి ఏలూరు 40 మైళ్ళ దూరంలో ఉంది. ఇది ప్రధానంగా ఉష్ణమండల వాతావరణం కలిగిన ప్రాంతం. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో బాగా వేడిగా ఉంటుంది. ఏలూరులో రికార్డయిన అత్యధిక ఉష్ణోగ్రత 51.7 డిగ్రీలు సెంటీగ్రేడ్, కాగా అత్యల్ప ఉష్ణోగ్రత 12.9 0 డిగ్రీల సెంటీగ్రేడ్.

పూర్వ‌కాలంలో వేంగి అనే రాజ్యంలో భాగంగా ఉంది. తూర్పు చాళుక్యులు, వేంగి రాజధానిగా క్రీ.శ‌. 700 నుంచి 1200 వరకు తీరాంధ్ర ప్రాంతాన్ని పరిపాలించారు. ఏలూరు (హేలాపురి) అప్పటి చాళుక్య సామ్రాజ్యంలో ఒక ప్రాంతంగా ఉండేది. 1471లో ముస్లింల దండయాత్ర జరిగే వరకు ఏలూరు కళింగ రాజ్యములో భాగంగా ఉంది. ఆ తరువాత గజపతుల ఏలుబ‌డిలోకి వ‌చ్చింది. 1515లో శ్రీ కృష్ణదేవరాయలు గజపతులను ఓడించి దీనిని చేజిక్కించుకున్నాడు. ఆ తరువాత గోల్కొండ నవాబు మహమ్మద్ కులీ కుతుబ్ షా వశమైంది. ఏలూరుకు సమీపంలో ఉన్న పెదవేగి, గుంటుపల్లె (జీలకర్ర గూడెం) గ్రామాలలో ఇందుకు సంబంధించిన అనేక చారిత్రక ఆధారాలు ఉన్నాయి.

బ్రిటిష్ వారి హ‌యాంలో ఉత్తర సర్కారు ప్రాంతాలను జిల్లాలుగా విభజించినప్పుడు ఏలూరును మచిలీపట్నం జిల్లాలో చేర్చారు. తరువాత 1859లో గోదావరి జిల్లాలో భాగమైంది. 1925లో పశ్చిమగోదావరి జిల్లాను ప్ర‌త్యేక జిల్లాగా ఏర్పాటు చేయ‌గా, ఆ జిల్లాకు కేంద్రంగా మారింది. 2005 ఏప్రిల్‌లో ఏలూరు మునిసిపాలిటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మునిసిపల్ కార్పొరేషన్‌గా మార్చింది.

ఇలా విభ‌జించారు

ఏలూరు నగరం ప్రధానంగా జాతీయ రహదారి వెంట విస్తరించి ఉంది. పట్టణం మధ్యలో తమ్మిలేరు కాలువ ఉండ‌టంతో స్థూలంగా పట్టణాన్ని I టౌన్ (త‌మ్మిలేరు కాలువకి ఆవల వున్న ప్రాంతం), II టౌన్ (తమిలేరు కాలువకి ఇవతల వున్న ప్రాంతం)గా భావించ‌వ‌చ్చు. అయితే పోస్టల్ చిరునామాల ఆధార‌రంగా తమిలేరు కాలువ నుంచి తూర్పు వైపు వున్న ప్రాంతాన్ని ఏలూరు-1, పవర్పేట, ఆర్ఆర్ పేట తదితర ప్రాంతాలను ఏలూరు-2 శ‌నివార‌పుపేట‌, ఏలూరు-3, చాట‌ప‌ర్రు రోడ్డు ప్రాంతం ఏలూరు-4, రైల్వే స్టేషన్, ఆదివారపు పేట ప్రాంతాలు ఏలూరు-5, నరసింహారావు పేట, అమీనాపేట, అశోక్ నగర్ ప్రాంతాలు ఏలూరు-6, వట్లూరు, విద్యానగర్, శాంతినగర్, సత్రంపాడు ప్రాంతాలు ఏలూరు-7గా విభజించారు.

వ్యాపార కేంద్రాలు : పాత‌బ‌స్టాండ్‌, మెయిన్‌బ‌జార్‌, బిర్లాభవన్ సెంటర్, చాటపర్రు రోడ్ సెంటర్, గ‌డియారపు స్తంభం, ఫైర్‌స్టేష‌న్‌, నరసింహారావు పేట, పత్తేబాద, జి యన్ టీ రోడ్

ప్రయాణ కేంద్రాలు: పెద్ద రైల్వే స్టేషను, పవర్ పే రైల్వే స్టేషను, వట్లూరు రైల్వే స్టేషన్, కొత్త బస్ స్టాండు, పాత బస్ స్టాండు, ఆశ్రం హాస్పిటల్

వైద్య కేంద్రాలు: రామచంద్రరావు పేట, న‌ర‌సింహారావు పేట, పెద్దాసుపత్రి, ఆశ్రం హాస్పిటల్

కూడళ్ళు:

I టౌన్ : గడియారపు స్తంభం సెంటర్, పెద్ద వంతెన సెంటర్, కర్ర వంతెన సెంటర్, వసంత మహల్ సెంట‌ర్‌, బిర్లా భవన్ సెంటర్, కొత్త రోడ్డూ, వంగాయగూడెం సెంటర్, జ్యూట్ మిల్ చౌర‌స్తా

II టౌన్లో : పాత బస్ స్టాండు సెంటర్, పవర్ పేట సెంటర్, రమామహల్ సెంటర్‌, మధులత సెంటర్, విజయవిహర్ సెంటర్, ఫైర్ స్టేషన్.

రవాణా, కమ్యూనికేషన్

రోడ్డు మార్గాలు

ఏలూరు నగరం కొల్‌క‌త - చెన్నై జాతీయ రహదారి NH5 పై ఉండి, అన్ని ప్రాంతాలకు రోడ్డు ప్రయాణ సౌకర్యాలు కలిగి ఉంది. ఏలూరు నుండి కొన్ని పట్టణాల దూరాలు - నరసాపురం100 కి.మీ., తణుకు 75 కి.మీ., భీమవరం 60 కి.మీ., జంగారెడ్డిగూడెం 50 కి.మీ., తాడేపల్లిగూడెం 51 కి.మీ., విజయవాడ 63 కి.మీ., రాజమండ్రి 100 కి.మీ., హైదరాబాదు 336కి.మీ., విశాఖపట్నం 306 కి.మీ., అమరావతి 90 కి.మీ.,భీమడోలు 22 కి.మీ., ద్వారకా తిరుమల 43 కి.మీ దూరంలో ఉన్నాయి.

ఏలూరు నుంచి జిల్లాలోని అన్ని ప్రాంతాలకు రోడ్డు ప్రయాణ సదుపాయం ఉంది. ప్రయాణీకుల అవసరాలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ నడిపే బస్సులే ప్రధాన ఆధారం. న‌గ‌రంలో, చుట్టుప్రక్కల గ్రామాలకు గ‌తంలో సిటీ బ‌స్సులు ఉండేవి. ప్ర‌స్తుతం అవి క‌నుమ‌రుగ‌వ‌డంతో ఆటోలు, ఆర్టీసీ బ‌స్సుల‌లో చేరుకోవ‌చ్చు. హైదరాబాదు నగరానికి ప్రైవేటు బస్సులు కూడా గణనీయంగా ఉన్నాయి. ఏలూరు నుండి విజయవాడకు దాదాపు ప్రతి పది నిముషములకు ఒక బస్సు ఉంటుంది. హైదరాబాదుకు ప్రతిరోజూ షుమారు 15 ఆర్.టి.సి. బస్సులు, మరో 20 ప్రైవేటు బస్సులు తిరుగుతుంటాయి.

రైలు మార్గం

చెన్నై - కొల్‌క‌త‌బ్రాడ్ గేజి రైలు మార్గం ఏలూరు మీదుగా నిర్మించ‌డంతో అన్ని సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు, అన్ని మెయిల్, ఎక్స్‌ప్రెస్‌లు ఏలూరు పెద్ద రైల్వేస్టేష‌న్‌లో ఆగుతాయి. హైదరాబాదు, చెన్నై, కోల్ క‌త విశాఖపట్నం, భువనేశ్వర్, బెంగళూరు, ముంబై, విజయవాడల‌కు రైలు ప్ర‌యాణం ద్వారా చేరుకోవ‌చ్చు. ఏలూరులో మూడు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఏలూరు పెద్ద రైల్వే స్టేషను లో అన్ని రైళ్ళు ఆగుతాయి. ఈ స్టేష‌న్‌లో మూడు ప్లాట్లుఫాంలు ఉన్నాయి. ఈ స్టేషను కి రెండు వైపుల టిక్కెట్టు కౌంట‌ర్లు ఉన్నాయి. పవర్‌పేట స్టేషను న‌గ‌రం న‌డిబొడ్డులో ఉంది. ఈ స్టేష‌న్‌లో అన్ని ప్యాసింజరు రైళ్ళు, సింహాద్రి ఎక్స్‌ప్రెస్ ఆగుతాయి. మూడోది వట్లూరు స్టేషన్. ఇది విజయవాడ వెళ్ళే రోడ్డులో ఊరి శివారున ఉంది. ఇక్కడ ప్యాసింజరు రైళ్ళు మాత్రమే ఆగుతాయి.

ట్రాఫిక్ సమస్య
ఏలూరులో ఉన్న ఐదు రైల్వేగేట్ల వ‌ల్ల స్థానికులు, ఇక్క‌డ‌కు రాక‌పోక‌లు సాగించే ఇత‌ర ప్రాంతాల ప్ర‌జ‌లకు నిత్యం ఇబ్బందులు ప‌డేవారు. విశాఖపట్నం నుంచి విజయవాడకు జాతీయ రహదారిలో ప్రయాణించే వారికి పెద్ద స్టేషను, పాత బస్ స్టాండు, ప‌వ‌రుపేట‌, ఫైర్‌స్టేష‌న్‌, వట్లూరు - అనే ఐదు గేట్లవద్ద ప్రయాణానికి అంతరాయం కలుగుతూ ఉండేది. 1970లో ఓవర్ బ్రిడ్జి కట్టిన తరువాత పట్టణం నడిబొడ్డున ఉన్నట్రాఫిక్ కొంత తీరినా మిగిలిన గేట్లు అలానే ఉండేవి. అనంత‌రం మినీ బైపాస్ నిర్మాణం, తరువాత 2005 నాటికి 17 కి.మీ. బైపాస్ రోడ్డు నిర్మించాక ఈ సమస్య చాలా వరకు ప‌రిష్కారమైంది. 2007లో ప్రెస్ గేటు వద్ద అండర్ వే బ్రిడ్జి నిర్మించారు. ప్ర‌స్తుతం వ‌ట్లూరు వ‌ద్ద ఓవ‌ర్‌బ్రిడ్జి నిర్మిస్తుండ‌టంతో గేట్ల సమస్య చాలావరకు పరిష్కారమైన‌ట్లే. కానీ పెరుగుతున్న ట్రాఫిక్ కారణంగా ఇతర సమస్యలైన పార్కింగ్, సిగ్నల్స్, తదిత‌ర స‌మ‌స్య‌ల‌కు ఇంకా శాశ్వ‌త ప‌రిష్కారం క‌నుగొనాల్సి ఉంది.

వాయు మార్గం
ఏలూరుకు 35 కి.మీల దూరంలో గ‌న్న‌వ‌రం విమానాశ్రయం ఉంది. ఇక్కడి నుంచి హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, పూనే, జైపూర్, రాజమండ్రి, విశాఖపట్నం, కోల్ కత్తా, ఢిల్లీలకు ప్రతిరోజూ విమాన స‌ర్వీసులు ఉన్నాయి.

జల మార్గం
కాలువల ద్వారా ఈ నగరానికి చేరుకోవడానికి గ‌తంలో వీలుండేది. ప్ర‌స్తుతం కాలువ‌లో నీరు ఉండ‌ట‌మే గ‌గ‌నంగా ఉండ‌టంతో ప్ర‌స్తుతం జ‌ల‌మార్గానికి వీలులేదు.

విద్యా సంస్థ‌లు
- శ్రీమతి ఈదర సుబ్బమ్మ దేవి మునిసిపల్ ఉన్నత పాఠశాల
- శ్రీ గాంధీ ఆంధ్ర జాతీయ మహావిద్యాలయం ఉన్నత పాఠశాల
- స‌ర్ క‌ట్ట‌మంచి రామ‌లింగారెడ్డి పేరుతో స్థాపించిన సీఆర్ ఆర్ విద్యా సంస్థ‌ల ఆధ్వ‌ర్యంలో ప‌బ్లిక్ స్కూలు, మోడ‌ల్ హైస్కూల్‌, జూనియ‌ర్‌, డిగ్రీ, పీజీ, బీఎడ్‌, మ‌హిళ‌ల‌కు ఇంట‌ర్‌, డిగ్రీ క‌ళాశాల‌లు ఉన్నాయి. అలాగే పాలిటెక్నిక్‌, ఇంజినీరింగ్ క‌ళాశాల‌లు వ‌ట్లూరులో ఉన్నాయి. సీఆర్ ఆర్ క‌ళాశాల జాతీయ విద్యా ప్ర‌మాణాల అంచ‌నా ప్రామాణిక నిర్దీక‌ర‌ణ మండ‌లి (నాక్‌)చే గుర్తింపు పొందింది. విశ్వ‌విద్యాల‌య స‌మాన హోదా కోసం సంస్థ కృషి చేస్తోంది.
- సెయింట్ థెరిసా విద్యా సంస్థలలో బాలికల పాఠశాల, ఉన్నత పాఠశాల, జూనియర్ కాలేజి, డిగ్రీ కాలేజి, పి.జి. కాలేజి ఉన్నాయి.
- ఆశ్రం మెడికల్ కాలేజి
- సీ.ఎస్.ఐ. విద్యా సంస్థలు
- దివ్య జ్ఞాన సమితి వారి విద్యా సంస్థల ద్వారా K.P.D.T. ఉన్నత పాఠశాల, S.P.D.B.T. జూనియర్ కాలేజి నడుపుతున్నారు.
- సెయింట్ గ్జేవియ‌ర్‌వారి విద్యా సంస్థల ఆధ్వ‌ర్యంలో రెండు ప్రాథమిక పాఠశాలలు, రెండు ఉన్నత పాఠశాలలు, ఒక ఐ.టి.ఐ. నడుపుతున్నారు.
- ప్రభుత్వ జూనియర్ కాలేజి, డీగ్రీ కాలేజి

వైద్య సదుపాయాలు
- ప్రభుత్వ ఆసుపత్రి - జిల్లా పెద్దాసుపత్రి 350 పడకలతో అన్ని సదుపాయాలతో సమీప ప్రాంతాల వారికి వైద్య సదుపాయాలు అందిస్తోంది.
- ఆశ్రం ఆసుపత్రి - మెడికల్ క‌ళాశాల‌కు అనుబంధంగా ఉంది. 780 పడకలతో ముఖ్యమైన అన్ని సదుపాయాలతో నిర్మింపబడింది. ఈ ఆసుపత్రిలో ఎన్టీ ఆర్ వైద్య‌పధకం ఉంది. ఈ ఆసుపత్రిలో మెడికల్ రీయింబర్స్మెంమెంట్ సదుపాయం ఉంది.
- డీ పాల్ దంత వైద్యశాల/ దంత వైద్య కళాశాల - ఇది దుగ్గిరాల సమీపంలో వుంది. రాష్ట్రంలొనే పెద్ద దంత వైద్య కళాశాల
- పెదవేగి చర్మ వైద్యశాల - ఇక్కడ అన్ని రకాల చర్మ వ్యాధుల‌కు చికిత్స అందిస్తున్నారు. కుష్టు వ్యాధికి మందు కూడా ఉచితంగా ఇస్తారు.

వ్యాపారం, పరిశ్రమలు
పారిశ్రామికంగా ఏలూరు చెప్పుకోదగినంత అభివృద్ధి సాధించలేదు. జూట్‌మిల్‌ మిన‌హా ఇక్కడ ఎక్కువ మందికి ఉపాధి కలిగించే పెద్ద పరిశ్రమలు లేవు. అంబికా దర్బార్ బత్తి మాత్రమే ప్రసిద్ధమైన బ్రాండ్ ఉత్పత్తి.

ఎగుమ‌తి
- ఏలూరు స‌మీపంలో కొల్లేరు స‌ర‌స్సు ఉండ‌టంతో చేపలు, రొయ్యలు ఏలూరు నుంచి ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి.
- పత్తేబాదలో నేత‌ చీరలు నేస్తారు.
- ఏలూరులో మ‌హ‌మ్మ‌దీయులు త‌యారుచేస్తున్న‌ తివాచీలు ఎక్కువ‌గా ఎగుమ‌తి అవుతుంటాయి.
- అంబికా దర్బార్ బత్తి, సంస్థ త‌యారుచేసే అగర్‌బత్తిలు దేశవ్యాప్తంగా గుర్తింపు కలిగి ఉన్నాయి. ఈ గ్రూప్ అధిపతులు ఇంకా సినిమా నిర్మాణం, విద్యుత్తు, హోటళ్ళు వంటి రంగాల్లో కూడా ఉన్నారు. ఈ సంస్థ ద్వారా ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా 5000 మందికి ఉపాధి కల్పిస్తున్నారు.
- జూట్ మిల్లు - ఈస్టిండియా కమర్షియల్ కార్పొరేషన్ వారి జనపనార పరిశ్రమ పట్టణం నడిబొడ్డున ఉన్న పెద్ద పరిశ్రమ. సుమారు 5000 మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. గోనె సంచులు, ఇతర జనపనార ఉత్పత్తులు ఇక్క‌డ త‌యార‌వుతాయి.
- గుప్తా గ్రూప్ - ప్రధానంగా ఎగుమతి వాణిజ్యం నిర్వహిస్తున్నారు. వెంట్రుకలు, తివాచీలు, ఇతర వ్యవసాయోత్పత్తులు.
- రైస్ మిల్లులు (వరి మర ఆడించు) పరిశ్రమలు ఉన్నాయి.

- మిరప పొడి, పొగాకు, జీడిమామిడి, దినుసులు, ఉల్లి, పచ్చళ్ళు, మామిడికాయలు, బియ్యం వంటి వాటికి సంబంధించిన ఉత్పత్తులను తయారుచేసి విక్ర‌యించే సంస్థలున్నాయి.

ఆటో నగర్
ఏలూరులో ఆటో న‌గ‌ర్ ఇంకా అభివృద్ది చెందాల్సి వుంది. ఆటో నగర్, ఆశ్రం ఆసుపత్రికి వెళ్లేదారిలో పెద్ద రైల్వే స్టేషనుకి చేరువలో ఉంది.

వినోదం
- ప‌త్తేబాద‌లో బృందావ‌నం పార్కు.
- అమీనాపేట‌లో సాధన సైన్స్ పార్కు
- ఆర్.ఆర్ పేట పార్కు

స్టేడియంలు
- ఏఎస్ ఆర్ స్టేడియం : కోస్తా తీరంలొనే పెద్దదైన అల్లూరి సీతారామరాజు స్టేడియంను పెద్ద రైల్వే స్టేష‌న్ ప్ర‌ధాన ద్వారం స‌మీపంలో నిర్మించారు. అయితే ప్ర‌స్తుతం సరైన నిర్వహణ లేదు.
- ఇండోర్ స్టేడియం. ఇక్క‌డ ఎక్కువగా ఎగ్జిబిషన్ లు నిర్వహిస్తుంటారు.

సినిమా హాళ్ళు
అంబికా డీలక్స్, ఆంబికా మినీ, అంబికా లిటిల్
బాలాజీ, సాయి బాలాజీ
సత్యనారాయణ, మిని సత్యనారాయణ, క్రాంతి
విజయలక్ష్మి డీలక్స్, విజయలక్ష్మి, విజయలక్ష్మి మిని

గ‌తంలో ఇక్కడ వెంకట్రామా టాకీస్, రమామహల్, శ్రీనివాస థియేటర్, విశ్వశాంతి, వేదరాజ్, కేసరి, వెంకటేశ్వర, పాండురంగ మహల్, గోపాలకృష్ణ చిత్రమహల్, రామకృష్ణ థియేటర్లు ఉండేవి. అయితే ప్రస్తుతం ఇవి మూతబడ్డాయి.

షాపింగ్ మాళ్ళు
చందనా షాపింగ్ మాల్, మెయిన్ బజార్
సెంట్రల్ ప్లాజా, విజయ విహార్ సెంటర్, రామచంద్ర‌రావు పేట
త్రినాధ్ ఫ్యాషన్స్, ఆర్ 9000 , రిలయన్స్, కళానికేతన్, డి.బి. ఫ్యాషన్స్‌, శుభమ్ గ్రాండ్‌

ఆలయాలు
న‌గ‌రంలోని ఆలయాల్లో కొన్నిటికి వెయ్యేళ్ల చ‌రిత్ర ఉంది. వీటిలో రామలింగేశ్వరస్వామి ఆలయం, జ్వాలాపహరేశ్వరస్వామి ఆలయం, కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయం, జనార్దన కన్యకాపరమేశ్వరీదేవి గుడి, మార్కండేయాలయం, ఓంకారేశ్వరస్వామి ఆలయాలు ఉన్నాయి.
జ్వలాపహరేశ్వర స్వామి వారి ఆలయం, దక్షిణపు వీధి
శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయం, పడమరవీధి
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, రామచంద్రరావు పేట
పాత శివాలయం, అగ్రహారం
సాయిబాబా గుడి, తూర్పు వీధి
సాయిబాబా గుడి, విద్యా నగర్
శ్రీ నం దత్త క్షేత్రం, దొండపాడు (దత్త ఆశ్రమం).
శ్రీ ఆది మహాలక్ష్మి అమ్మ వారి ఆలయం, పడమరవీధి
వెంకటేశ్వర దేవస్థానం, వెంకట్రావుపేట
హజ్రత్‌సయ్యద్‌బాయజీద్‌మహాత్ముల వారి దర్గా, అగ్రహారం, కోటదిబ్బ.
నూకాలమ్మ గుడి, ఆదివారపు పేట.
శ్రీ మార్కండేయ స్వామి గుడి, దక్షిణపు వీధి
శ్రీ కోదండ రామాలయం (బొమ్మల గుడి), పడమరవీధి.
శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం.
శ్రీ అంబికాదేవి ఆలయం
ఏలూరు దర్గా, కోట దిబ్బ మసీదు.
ఏలూరు సి.యస్.ఐ చర్చి.
ఏలూరు రొమన్ కాతలిక్ చర్చి, గ్జేవియర్ నగర్
హోరేబు ప్రార్ధనా మందిరం చర్చి (పవరు పేట).
మన్నా చర్చి(శాంతి నగర్).
మేరి మాత టవరు (వట్లూరు)
మేరి మాత టవరు, విద్యా నగర్

జాత‌ర‌, ఉత్స‌వాలు
దర్గా ఉరుసు ఉత్సవం
ప‌దేళ్ల‌కోసారి జ‌రిగే గంగాన‌మ్మ అమ్మ‌వారి జాత‌ర
కొల్లేరు పెద్దింట్ల‌మ్మ తిరునాళ్లు
బ‌లివే తిరునాళ్లు
అచ్చ‌మ్మ పేరంటాళ్ల తిరునాళ్లు,గాలాయ‌గూడెం
వేంగి ఉత్స‌వం

స‌మీపంలో చూడ‌ద‌గ్గ ప్రాంతాలు
కొల్లేరు సరస్సు ఆటపాక, కొల్లేటి కోట
ద్వారకాతిరుమల
గుంటుపల్లి బౌద్ధారామాలు
రాట్నాలమ్మ తల్లి ఆలయం
"నం"దత్తనాధ క్షేత్రం