ads
తాజా :
Leela Narayana Pest Control
Sree VijayaLakshmi Textiles
For Suggestions
January 24, 2017 8:08 PM 125


- రాష్ట్ర మ‌హిళా శిశు సంక్షేమం, గ‌నులు శాఖ మంత్రి పీత‌ల సుజాత
- మ‌హిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వ‌ర్యంలో జాతీయ బాలికా దినోత్స‌వం
వెబ్ఏలూరు.కామ్ డెస్క్ : బాల‌ల అభ్యున్న‌తికి స‌మాజంలో ప్ర‌తి ఒక్క‌రూ పాటుపడాల‌ని రాష్ట్ర మ‌హిళా శిశు సంక్షేమం, గ‌నులు శాఖ మంత్రి పీత‌ల సుజాత చెప్పారు. స్థానిక ఐఏడీపీ హాలులో మంగ‌ళ‌వారం మ‌హిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన జాతీయ బాలికా దినోత్స‌వాన్ని ఆమె జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ బాలిక‌లు, మ‌హిళ‌ల‌కు అన్ని రంగాల్లో స‌ముచిత స్థానం క‌ల్పించే విష‌యంలో నాటి ముఖ్యమంత్రి స్వ‌ర్గీయ ఎన్టీఆర్ నుంచి నేటి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు వ‌ర‌కు ఎంతో కృషి చేశార‌న్నారు. మ‌హిళ‌లు చ‌దువుకునే దారి చూపిన సావిత్రిపూలె, మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేక హ‌క్కులు రాజ్యాంగంలో పొందుప‌రిచిన డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ వంటి మ‌హావ్య‌క్తుల ఆద‌ర్శాల‌ను స్ఫూర్తిగా తీసుకుని బాలిక‌లు, మ‌హిళ‌ల అభివృద్ధే ధ్యేయంగా ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌న్నారు. ఆడ‌పిల్ల‌ల‌ను చ‌దివించ‌డానికి త‌ల్లిదండ్రులు ముందుకురావాల‌ని, ఇందుకు ప్ర‌భుత్వ‌ప‌రంగా తోడ్పాటును అందిస్తామన్నారు. రాష్ట్రంలో క‌డ‌ప జిల్లాలో 1000 మంది పురుషుల‌కు 918 మంది మ‌హిళ‌లు ఉన్నార‌ని, దీనిని దృష్టిలో పెట్టుకుని భేటి ప‌డావో, భేటి బ‌చావో కార్య‌క్ర‌మంపై రూ.రెండు కోట్ల తో అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాన్నిచేప‌ట్టామన్నారు. జిల్లాలో 2011 జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం 1000 మంది పురుషుల‌కు 964 మంది మ‌హిళ‌లు ఉన్నార‌న్నారు. బాలికా, మ‌హిళా సంక్షేమానికి రాష్ట్ర ప్ర‌భుత్వం గ‌త రెండేళ్ల‌లో తీసుకున్న చ‌ర్య‌ల వ‌ల్ల జిల్లాలో 2,105 బాల్య‌వివామాల‌ను అరిక‌ట్టామ‌ని, 2,040 మంది బాల‌కార్మికుల‌ను గుర్తించి వారికి పున‌రావాసం క‌ల్పించామ‌ని, 697 మంది త‌ప్పిపోయిన బాలిక‌ల‌ను గుర్తించి వారి త‌ల్లిదండ్రుల‌కు అప్ప‌గించామ‌న్నారు. కార్య‌క్ర‌మానికి అధ్యక్ష‌త వ‌హించిన‌ ఎమ్మెల్యే బడేటి కోట రామారావు (బుజ్జి) మాట్లాడుతూ బాలిక‌లు, మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ కల్పించ‌డం సామాజిక బాధ్య‌తగా ప్ర‌తి ఒక్క‌రూ గుర్తుంచుకోవాల‌న్నారు. విద్య‌న‌భ్య‌సించ‌డం ద్వారానే బాల్య‌వివాహాలు నిరోధింబ‌డ‌తాయ‌న్నారు. ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ బాల‌ల ప‌రిర‌క్ష‌ణ‌లో ప్ర‌తి ఒక్క‌రూ భాగ‌స్వాములు కావాల‌న్నారు. జాతీయ బాలికాదినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌తిజ్ఞ కార్య‌క్ర‌మాన్ని మంత్రి సుజాత నిర్వ‌హించారు. అనంత‌రం అంధురాలైన‌ సాయి త‌బ‌లా వాయిద్యం అందరినీ ఆక‌ట్టుకుంది. బాలిక‌ను మంత్రి సుజాత అభినందించారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న జాహ్న‌విలాలిత్య‌, కృషి, భాగ్య‌ల‌క్ష్మి, మ‌మ‌త‌, సింధు, ర‌మాదేవి, అజిత‌, సుష్మ‌, దీప్తి సుస్మిత‌, దివ్య‌, ప్రియాంక‌, ఆలైఖ్య‌, రాజ్య‌ల‌క్ష్మి, ప్ర‌శాంతి, ధాన్య‌ల‌క్ష్మి, విజ‌య‌ల‌క్ష్మి తదిత‌రుల‌ను మంత్రి సుజాత మెమెంటోల‌తో స‌త్క‌రించారు. అనంత‌రం నేత‌ల ర‌మేష్ ఆధ్వ‌ర్యంలో చైల్డ్ రైట్స్ సంస్థ త‌ర‌ఫున ప్ర‌చురించిన పోస్ట‌ర్ల‌ను, క‌ర‌ప‌త్రాల‌ను మంత్రి ఆవిష్క‌రించారు. ఏఎంసీ చైర్మ‌న్ కురెళ్ల రామ్‌ప్ర‌సాద్‌, అద‌న‌పు జాయింట్ క‌లెక్ట‌ర్ ఎంహెచ్ ష‌రీఫ్‌, ఆర్డీవో నంబూరి తేజ్‌భ‌ర‌త్‌, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ ఆర్‌జెడి విద్యావ‌తి, డీఎంహెచ్‌వో డాక్ట‌ర్ కె.కోటేశ్వ‌రి పాల్గొన్నారు.