ads
Sree VijayaLakshmi Textiles
Leela Narayana Pest Control
For Suggestions
1

వెబ్ఏలూరు.కామ్ డెస్క్ : ప్ర‌త్యేక హోదా సాధించుకోవ‌డం రాని రాష్ట్ర పాల‌కులు ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కు ఉద్య‌మిస్తున్న వారిని అక్ర‌మ అరెస్ట్‌లు చేయించ‌డం దారుణ‌మ‌ని భార‌త విద్యార్థి ఫెడ‌రేష‌న్ (ఎస్ఎఫ్ఐ) ఏలూరు న‌గ‌ర కార్య‌ద‌ర్శి కారుమంచి క్రాంతిబాబు మండిప‌డ్డారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌జా ఉద్య‌మాల‌పై ప్ర‌యోగిస్తున్న నిర్బంధ కాండ‌ల‌ను ఖండిస్తూ శుక్ర‌వారం స్థానిక స‌ర్ సీఆర్ ఆర్ క‌ళాశాల వ‌ద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వ‌ర్యంలో ప్ర‌భుత్వ దిష్టిబొమ్మ‌ను ద‌గ్ధం చేసి శాంతియుతంగా నిర‌స‌న తెలుపుతున్న ఎస్ఎఫ్ఐ నాయ‌కుల‌ను పోలీసులు అక్ర‌మంగా అరెస్ట్ చేసి టుటౌన్ పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఈ సంద‌ర్భంగా క్రాంతిబాబు మాట్లాడుతూ శాంతియుతంగా నిర‌స‌న‌లు తెలియ‌జేయ‌డం ప్ర‌జాస్వామ్య హ‌క్కు అని, అలాంటి హ‌క్కుల‌ను కాల‌రాసేలా రాష్ట్ర పాల‌కులు నియంతృత్వంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని విమ‌ర్శించారు. అక్ర‌మ అరెస్ట్‌లు చేయ‌డం దారుణ‌మ‌న్నారు. ప్ర‌త్యేక హోదాకు ప్ర‌త్యేక ప్యాకేజీకి తేడా తెలియ‌కుండా చంద్ర‌బాబు స‌ర్కారు ఉంద‌ని ఎద్దేవా చేశారు. రాజ‌కీయ స్వార్థం కోసం చంద్ర‌బాబు అండ్‌కో రాష్ట్రాన్ని తాక‌ట్టు పెడుతున్నార‌న్నారు. అరెస్ట్‌ల‌తో ఉద్య‌మాల‌ను అణిచివేయలేర‌ని, భ‌విష్య‌త్తులో ఉద్య‌మాల‌ను మ‌రింత ఉధృతం చేస్తామ‌ని హెచ్చ‌రించారు. అరెస్ట్ అయిన వారిలో ఎస్ఎఫ్ఐ నాయ‌కులు కె.ప్ర‌సాద్‌, సీహెచ్ భ‌ర‌త్‌, బి.సుద‌ర్శ‌న్‌, కె.ర‌వికిర‌ణ్ ఉన్నారు.