ads
Sree VijayaLakshmi Textiles
Leela Narayana Pest Control
For Suggestions
1

- జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ఎయిర్‌పోర్టులోనే నిర్బంధిండం అనాగరిక చ‌ర్య
- చంద్ర‌బాబు, టీడీపీ నాయ‌కులు ఉద్య‌మంపై అవాకులు, చెవాకులు మాట్లాడ‌టం స‌రికాదు
- ఆంధ్రుల ఆత్మ‌గౌర‌వాన్ని కించ‌ప‌రిచేలా సుజ‌నాచౌద‌రి వ్యాఖ్యలు
- ఉద్య‌మంలో టీడీపీ భాగ‌స్వామి కావాలి లేదా స‌హ‌క‌రించాలి
- ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చాల్సిన బాధ్య‌త టీడీపీ ప్ర‌భుత్వానిదే
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆళ్ల కాళీకృష్ణ శ్రీ‌నివాస్ (నాని)
- విలేక‌రుల స‌మావేశంలో వెల్ల‌డి
వెబ్ఏలూరు.కామ్ డెస్క్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సార‌ధ్యంలో రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా సాధించి తీరుతామ‌ని ఆ పార్టీ జిల్లా అధ్య‌క్షుడు ఆళ్ల కాళీకృష్ణ శ్రీ‌నివాస్ (నాని) అన్నారు. శుక్ర‌వారం త‌న స్వ‌గృహంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం ఐదు కోట్ల మంది ప్ర‌జ‌ల ఆకాంక్ష అని, ప్ర‌త్యేక హోదా కోసం రోజురోజుకు తీవ్ర మ‌వుతున్న ఉద్య‌మాన్ని అణ‌చివేసేందుకు టీడీపీ ప్ర‌భుత్వం కుట్ర చేస్తుండ‌టంపై రాష్ట్రంలో ప్ర‌జానీకం తీవ్ర అసంతృప్తితో ఉంద‌న్నారు. శాంతియుతంగా గాంధేయ‌మార్గంలో ప్ర‌జా ఉద్య‌మాన్ని చేప‌ట్టి న‌డిపిస్తుంటే చంద్ర‌బాబు ఉక్కుపాదంతో అణ‌గ‌దొక్కేందుకు ప్ర‌య‌త్నించడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంద‌న్నారు. పార్టీల‌కు అతీతంగా విశాఖ‌ప‌ట్ట‌ణంలో జ‌రిగే ఉద్య‌మానికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డానికి వెళ్లిన జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ఎయిర్‌పోర్టులోనే నిర్బంధిండం అనాగరిక చ‌ర్య అన్నారు. ప్ర‌జా ఉద్య‌మాన్ని ఎంత అణ‌గ‌దొక్కాల‌ని చూసినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌జ‌ల‌తో క‌లిసి ఉద్య‌మిస్తుంద‌న్నారు. ప్ర‌త్యేక హోదా సాధించేవ‌ర‌కు పార్టీ అధినేత‌, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు విశ్ర‌మించేది లేద‌న్నారు. చంద్ర‌బాబు, టీడీపీ నాయ‌కులు ప్ర‌జ‌లు చేస్తున్న ఉద్య‌మంపై అవాకులు, చెవాకులు మాట్లాడ‌టం స‌రికాదన్నారు. తమిళ‌నాడులో జ‌ల్లిక‌ట్టు క్రీడ‌పై నిషేధం ఎత్తివేతకు అక్క‌డి యువ‌త చూపిన‌ స్ఫూర్తితో రాష్ట్రంలో ప్ర‌త్యేక హోదా కోసం ఉద్య‌మించ‌గా, దీనిపై క‌నీస ప‌రిజ్ఞానం లేకుండా కావాలంటే జ‌ల్లిక‌ట్టు మాదిరిగా కోడిపపందాలు, పందుల పందాలు ఆడుకోండి అని సుజ‌నా చౌద‌రి వ్యాఖ్య‌లు చేయ‌డం దారుణ‌మ‌న్నారు. అక్క‌డి యువ‌త చూపిన‌ స్ఫూర్తితో ఇక్క‌డ జ‌రుగుతున్న ఉద్య‌మాన్ని వ‌క్రీక‌రించేలా అభివ‌ర్ణించ‌డం చూస్తుంటే సుజ‌నా చౌద‌రి, చంద్ర‌బాబులకు ప్ర‌త్యేక‌ హోదాపై వారికి ఉన్న నిర్ల‌క్ష్యాన్ని వెల్ల‌డిస్తోంద‌న్నారు. ప్ర‌త్యేక హోదాపై ఆంధ్రుల‌ మ‌నోవేద‌న‌ను గ‌మ‌నించ‌కుండా వారి ఆత్మ‌గౌర‌వాన్ని కించ‌ప‌రిచేలా వ్యాఖ్యానించ‌డం సిగ్గుచేట‌న్నారు. ఇటువంటి వ్య‌క్తుల‌కు ప్ర‌జ‌ల్లో చేతుల్లో చెప్పుదెబ్బ‌లు, రాళ్ల‌ దెబ్బ‌లు త‌ప్ప‌వ‌న్నారు. ఇప్ప‌టికైనా టీడీపీ నేత‌లు ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను కించ‌ప‌రిచేలా వ్యాఖ్య‌లు చేయ‌డం మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను తాక‌ట్టు పెట్ట‌డం మాని ప్ర‌త్యేక హోదా అంశంలో ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చాల్సిన బాధ్య‌త టీడీపీ ప్ర‌భుత్వంపై ఉంద‌న్నారు. ప్ర‌త్యేక హోదాపై జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి అవ‌గాహ‌న లేద‌ని జిల్లాకు చెందిన బీజేపీ మంత్రి మాణిక్యాల‌రావు విమ‌ర్శించ‌డాన్ని నాని ఖండించారు. తిరుప‌తి సాక్షిగా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడి ఆంధ్రప్ర‌దేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామ‌న్న హామీ విష‌యాన్ని మ‌రిచిపోయారా అంటూ ప్ర‌శ్నించారు. ప్ర‌త్యేక హోదాపై అస‌లు మాణిక్యాల‌రావుకు ఉన్న అవ‌గాహ‌న ఏంటో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ల‌క్ష‌ల మందికి చేసిన హామీల‌ను విస్మ‌రిస్తున్నది ఎవ‌రో తెలుసుకోవాల‌న్నారు. అవ‌గాహ‌న రాహిత్యంతో విమ‌ర్శించ‌డం, నాయ‌కుల గురించి తెలుసుకుని మాణిక్యాల‌రావు విమ‌ర్శించాల‌ని హిత‌వు ప‌లికారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌జ‌ల‌కు అన్యాయం చేయ‌క‌కుండా చేత‌కానిత‌నం, అస‌మ‌ర్థ‌తను అంగీక‌రిస్తూ చంద్ర‌బాబు ఇక‌నైనా ప్ర‌త్యేక హోదా కోసం ఉద్య‌మంలో ప్ర‌జ‌ల‌తో క‌లిసి రావాల‌ని, లేదా క‌నీసం రాష్ట్ర భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డ్డ ప్ర‌త్యేక హోదాపై ప్ర‌జ‌లు చేసే పోరాటాల‌కు విఘాతం క‌లిగించ‌కుండా ఉండాల‌ని కోరారు.
సేవ చేసేందుకు రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నా
సేవ చేసేందుకే రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాన‌ని మాజీ మంత్రి కోట‌గిరి విద్యాధ‌ర‌రావు త‌న‌యుడు కోట‌గిరి శ్రీ‌ధ‌ర్ అన్నారు. ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు రాజ‌కీయాలు ద్వారా విస్తృత అవ‌కాశం ఉంద‌న్నారు. వ్య‌క్తిగ‌తంగా చేసే సేవ‌ల కంటే రాజ‌కీయాల ద్వారా ఎక్కువ మంది సేవ చేసే అవ‌కాశం ఉంద‌న్నారు. త‌న తండ్రి దాదాపు 30 సంవ‌త్స‌రాల పాటు జిల్లా ప్ర‌జ‌ల‌కు చిత్త‌శుద్ధితో సేవ‌లందించార‌న్నారు. త‌న‌ తండ్రి అభిమానులు, అనుచ‌రులను సంప్ర‌దించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాల‌ని జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని క‌లిశామ‌ని, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు మంచి భ‌విష్య‌త్ ఉంటుంద‌నే ఆలోచ‌న‌తో వైఎస్సార్ సీపీలో చేరాల‌ని నిర్ణ‌యించుకున్నామ‌న్నారు. రాష్ట్రానికి, జిల్లా ప్ర‌జ‌ల‌కు ఏదైనా మంచి చేయాల‌నే తలంపుతోనే వైసీపీలో చేరుతున్న‌ట్టు తెలిపారు. జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ద్వారానే రాష్ట్రాభివృద్ధి సాధ్య‌మ‌న్నారు.
29న వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రాక‌
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఈ నెల‌ 29వ తేదీన జిల్లాకు రానున్న‌ట్టు ఆ పార్టీ అధ్య‌క్షుడు ఆళ్ల నాని చెప్పారు. ప‌ర్య‌ట‌న వివ‌రాల‌ను వెల్ల‌డించారు. 29వ తేదీన మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు రాజ‌మండ్రి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటార‌ని, అక్క‌డ నుంచి రోడ్డు మార్గం ద్వారా మూడు గంట‌ల‌కు ద్వార‌కాతిరుమ‌ల చేరుకుంటార‌న్నారు. 3.30 గంట‌ల‌కు ద్వార‌కాతిరుమ‌ల‌లో శ్రీ‌వెంక‌టేశ్వ‌ర‌స్వామి ద‌ర్శ‌నం అనంత‌రం 4 గంట‌ల‌కు బ‌హిరంగ స‌భ ప్రాంగ‌ణానికి చేరుకుంటార‌న్నారు. అనంత‌రం రాత్రి 10 గంట‌ల‌కు గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్టు నుంచి హైద‌రాబాద్ బ‌య‌లుదేరి వెళ‌తారు. విలేక‌రుల స‌మావేశంలో వైఎస్సార్ సీపీ నాయ‌కులు తెల్లం బాల‌రాజు, త‌లారి వెంక‌ట్రావు, కొఠారు రామ‌చంద్ర‌రావు, పుప్పాల వాసుబాబు, మ‌ధ్యాహ్న‌పు బ‌ల‌రామ్‌, గుడిదేశి శ్రీ‌నివాస‌రావు, మంచెం మైబాబు పాల్గొన్నారు.