ads
తాజా :
Leela Narayana Pest Control
Sree VijayaLakshmi Textiles
For Suggestions

- నేష‌న‌ల్ హైవేస్‌కు నిర్మాణం అప్ప‌గించాల‌ని చెప్పినా ప‌ట్టించుకోక‌పోవ‌డంపై ఆగ్ర‌హం
-హ‌డావిడిగా ప‌నులు చేప‌ట్ట‌డంపై ఆర్అండ్‌బీ అధికారులను నిల‌దీసిన క‌లెక్ట‌ర్ భాస్క‌ర్‌
- ఆర్అండ్‌బీ రోడ్ల అభివృద్ధి, ప‌నుల ప్ర‌గ‌తిపై అధికారుల‌తో స‌మీక్ష‌
వెబ్ఏలూరు.కామ్ డెస్క్ : జిల్లాలో రోడ్ల నిర్మాణంలో నాణ్య‌తా ప్ర‌మాణాల‌ను పాటించాల‌ని ముఖ్యంగా రూ.200 కోట్ల వ్య‌యంతో చేప‌ట్టిన ప‌లు ర‌హ‌దారులు, 15 బ్రిడ్జీల నిర్మాణ ప‌నుల‌ను శ‌ర‌వేగంతో పూర్తి చేయాల‌ని క‌లెక్ట‌ర్ కాటంనేని భాస్క‌ర్ ఆదేశించారు. క‌లెక్ట‌రేట్‌లో శ‌నివారం ఆర్అండ్‌బీ రోడ్ల అభివృద్ధి, ప్ర‌గ‌తితీరుపై ఆయ‌న స‌మీక్షించారు. న‌ర‌సాపురం - తాడేప‌ల్లిగూడెం - అశ్వారావుపేట ర‌హ‌దారి, క‌న్నాపురం - బుట్టాయ‌గూడెం రోడ్డు, దెందులూరు - పంగిడిగూడెం రోడ్డు వెడ‌ల్పు, అభివృద్ధి ప‌నుల‌ను వేగ‌వంతం చేయాల‌ని ఆదేశించారు. పోణంగిపుంత రోడ్డు, ఆగ‌డాల‌లంక రోడ్డు, ఏలూరు - పెరికీడు ర‌హ‌దారి, ఏలూరు - వ‌డ్డిగూడెం, రూ.10 కోట్ల‌తో చేప‌ట్టే మేడిశెట్టివారిగూడెం రోడ్డు, రూ.24 కోట్ల చేప‌ట్టే ఏలూరు - జంగారెడ్డిగూడెం రోడ్డు నిర్మాణ ప‌నుల్లో నాణ్య‌తా ప్ర‌మాణాలు పాటించాల‌న్నారు.
జీలుగుమిల్లి - జంగారెడ్డిగూడెం రోడ్డును నేష‌న‌ల్ హైవేస్‌కు అప్ప‌గించాల‌ని ఆరు నెల‌ల నుంచి చెబుతున్నా ప‌ట్టించుకోకుండా హ‌డావిడిగా జీలుగుమిల్లి - జంగారెడ్డిగూడెం రోడ్డు నిర్మాణ ప‌నులు ఎందుకు చేప‌ట్టార‌ని క‌లెక్ట‌ర్ అధికారుల‌ను ప్ర‌శ్నించారు. నేష‌న‌ల్ హైవేస్‌కు ఈ రోడ్డును అప్ప‌గిస్తున్న‌ప్పుడు హ‌డావిడిగా ఎందుకు ప‌నిచేపట్టార‌ని, ఈ వ్య‌వ‌హారంలో ఏదైనా గోల్‌మాల్ జ‌రిగిందా ఎక్క‌డైనా అక్ర‌మాల కోసం ఈ ప‌నులు చేస్తున్నారా? అనే కోణంలో విచార‌ణ జ‌రిపి నివేదిక ఇవ్వాల‌ని విజిలెన్స్ అధికారుల‌ను ఆదేశిస్తున్న‌ట్టు క‌లెక్ట‌ర్ చెప్పారు.
మ‌ల్కాపురం చాట‌ప‌ర్రు రోడ్డు విస్త‌ర‌ణ కోసం భూమి సేక‌రించ‌డానికి రూ.13 కోట్లు నిధులు ఖ‌ర్చ‌వుతాయ‌ని క‌లెక్ట‌ర్ చెప్పారు. స్పెష‌ల్ క‌లెక్ట‌ర్ భానుప్ర‌సాద్‌, డీఆర్‌వో క‌ట్టా హైమావ‌తి, న‌ర‌సాపురం స‌బ్ క‌లెక్ట‌ర్ సుమిత్‌కుమార్ గాంధీ, కొవ్వూరు ఆర్డీవో బి.శ్రీ‌నివాస‌రావు, ఏలూరు ఆర్డీవో జి.చ‌క్ర‌జధ‌ర‌రావు పాల్గొన్నారు.